women life: ఆ అవ్వ గుండెకు ఎన్ని గాయాలో…

* జీవితం మొత్తం దుఃఖ సాగరమే..
* గిట్టని వాళ్ల కుట్రలకు విచ్ఛిన్నమైన కుటుంబం
* పచ్చని సంసారాల్లో నిప్పులు పోసిన శత్రువులు

పేదింట పుట్టిన ఓ ఆడబిడ్డ పెద్దింటికి వెళ్లింది. కోటి ఆశలతో.. కష్టాల ఒడ్డు దాటుతున్నానన్న సంతోషంతో మెట్టినింట్లో అడుగు పెట్టింది. అయితే అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. కడుపు కట్టుకొని పని చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయినా ఆ తల్లి నీరసపడలేదు. ముగ్గురు పిల్లలను సాదాలనే సంకల్పం ముందు కష్టం చిన్నబోయింది. (Women Story) ఎట్టకేలకు ముగ్గురిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఓ ఇంటి వారిని చేసింది. ఇంకేముంది బాధ్యతలు తీరి బాదరాబందీ లేకుండా ఉండాలనుకుంది. కానీ ఆ తల్లికి మరో రూపంలో కష్టాలు మళ్లీ వెంటాడుతున్నాయి. పచ్చని కుటుంబం శత్రువుల కుట్రలకు విచ్ఛిన్నమైంది. అల్లారుముద్దుగా పెంచిన కొడుకుల పరిస్థితిని చూసి ఆ తల్లి గుండె ఘొల్లుమంటోంది. పచ్చని పైరులా ఎదుగుతున్న కుటుంబం ప్రస్తుతం ఎలాంటి బాధలు పడుతోంది… చేతికందిన కొడుకుల కాపురాల్లో ఓర్వని వారు పెట్టిన చిచ్చు ఎలా అగ్గి రేపుతోంది.. కంటికి కునుకు.. కడుపుకు తిండి లేక ఆ కుటుంబం ఎలాంటి కష్టాలు పడిందో వివరించే ప్రయత్నమే ఈ కథనం…(Women Life)

women life: ఆ అవ్వ గుండెకు ఎన్ని గాయాలో...

అరవై ఏళ్ల ఆ అవ్వ జీవితమంతా కష్టాలమయమే. పిల్లలను పెద్ద చేసే వరకు పడ్డ కష్టాలు ఒక ఎత్తయితే.. వారికి పెళ్లిల్లు చేశాక పడ్డ కష్టాలు మరో ఎత్తు. గిట్టని వారు పెట్టిన చిచ్చుకు ఆ కుటుంబంలో అగ్గి రాజుకుంది. చేయని తప్పులకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికే సగం జీవితం అయిపోయింది. కొడుకుల జీవితాలూ ఆగమ్యగోచరంగానే ఉండడంతో ఇప్పటికీ ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ కాలం గడుపుతోంది. శత్రువుల వ్యూహానికి పచ్చని కుటుంబం చెల్లాచెదురైంది. వివరాల్లోకెళితే… హైదరాబాద్ పాతబస్తీలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మణెమ్మ(Manemma) చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను చవిచూసింది. ఆమెకు పదమూడేళ్ల వయస్సులోనే జనగామకు చెందిన బాల్దె యాదగిరితో వివాహమైంది. పెళ్లి కాగానే కష్టాలన్నీ గట్టెక్కినట్టేనని, కొత్త జీవితం సాఫీగా ఉంటుందని భావించగా పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెళ్లయిన కొన్ని రోజులకే కూలీకి వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు అలవాటు లేని కల్వ పనికి వెళ్లి నానా తిప్పలు పడింది. భర్త తాగుడుకు బానిస కావడంతో కుటుంబ బాధ్యతలు మణెమ్మ పైనే పడ్డాయి. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె వారిని సాకేందుకు పడ్డ యాతన అంతా ఇంతా కాదు. కూలీ నాలీ చేస్తూ పిల్లల కడుపు నింపేది. భర్తకు తెలియకుండానే ఉప్పరి పనికి సైతం వెళ్లిన మణెమ్మ(Manemma).. ఆ తరువాత కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి ఇంటిని చక్కదిద్దింది.

women life: ఆ అవ్వ గుండెకు ఎన్ని గాయాలో...

చిట్టీల మణెమ్మగా హల్చల్..
ఓ వైపు కూలీ పనులు చేస్తూనే మరో వైపు చిన్నగా చిట్టీల వ్యాపారాన్ని మణెమ్మ ప్రారంభించింది. అప్పటికే మంచి కష్టజీవిగా, అందరిని కలుపుకుపోయే మనిషిగా పేరుండడంతో ఆమె వద్ద చిట్టీలు వేయడానికి చాలా మంది ఆసక్తి కనబరిచారు. రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో మణెమ్మ ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలిగింది. ఎలాగైనా ఇల్లు కట్టాలనే సంకల్పంతో ఆమె ఎంతో కష్టపడింది. ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అసరమున్నాయంటే చాలు.. వినియోగదారులు మణెమ్మ దగ్గర వాలిపోయే వారు. ఆమె దగ్గరికి వెళ్తే ఎలాగైనా డబ్బులు వస్తాయన్న నమ్మకం వారిలో ఉండేది. వేయి రూపాయలతో ప్రారంభించిన చిట్టీల వ్యాపారం లక్షల్లోకి చేరుకుంది. ఇప్పటికీ మణెమ్మను అందరూ చిట్టీల మణెమ్మ(Chittila Manemma) అంటారు. సుమారు వెయ్యి మంది కస్టమర్లను మణెమ్మ డీల్ చేసింది. ఏమాత్రం చదువుకోని ఆమె కేవలం నోటి లెక్కలతోనే ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించింది. తన చిరకాల వాంఛ అయిన ఇంటి నిర్మాణ లక్ష్యాన్ని ఎట్టకేలకు పూర్తి చేసింది. ఈమె వద్దకు చిట్టీల కోసం జనం క్యూ కడుతుండడంతో పెద్ద పెద్ద చిట్​ఫండ్​  కంపెనీల ప్రతినిధులు సైతం షాక్​కు గురయ్యారు. 2000 సంవత్సరంలో ఒక్కగానొక్క కూతురి వివాహాన్ని మణెమ్మ ఘనంగా జరిపించింది. ఆ తరువాత ఏడాదికే చిట్టీల బిజినెస్​లో నష్టాలు రావడంతో ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.(women life)

women life: ఆ అవ్వ గుండెకు ఎన్ని గాయాలో...

పెద్ద కొడుకు పెళ్లి ఫిక్స్ కాగానే..
చిట్టీల బిజినెస్​లో నష్టాలు చవిచూశాక మణెమ్మ కుటుంబ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె అక్కడక్కడా బియ్యం తీసుకొచ్చి మరీ ఇంటిని వెళ్లదీసింది. ఇదే సమయంలో పెద్ద కొడుకు శ్రీనివాస్​(Srinivas)కు పెళ్లి చేయాలని దగ్గరి బంధువు సలహా ఇచ్చారు. వారి ద్వారా ఓ కుటుంబం పెళ్లి చూపులకు వచ్చి కొంత డబ్బు ఇచ్చి సంబంధం ఫిక్స్ చేసుకుని వెళ్లిపోయారు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో పెళ్లి సంబంధం కుదరడంతో పాలుపోని పరిస్థితిలో మణెమ్మ కుటుంబం ఉంది. ఇదే సమయంలో గిట్టని వారు ఉసిగొల్పడంతో చిట్టీల పైసలు బకాయి ఉన్న ఒక మహిళ మణెమ్మ దగ్గరికి వచ్చి దుర్భాషలాడడమే కాకుండా భౌతిక దాడికి దిగింది. అక్కడే ఉన్న చిన్న కొడుకు దేవేందర్(Devender) అడ్డుకోబోవడంతో వీరిద్దరిపై సదరు మహిళ అక్రమ కేసు బనాయించింది. దీంతో తల్లీకొడుకులిద్దరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఏ తప్పు ఎరగని మణెమ్మ ఏకంగా జైలు ఊసలు కూడా లెక్కించింది. అప్పటి నుంచి వీరికి మొత్తం గడ్డు పరిస్థితులే. ఎలాగోలా పెద్ద కొడుకు పెళ్లి తంతు పూర్తి చేశారు. ఆ తరువాత ఇంట్లో పరిస్థితుల వల్ల మణెమ్మ జనగామలోని ఏకశిల పబ్లిక్ స్కూల్​లో ఆయాగా పనికి ఎక్కింది. అంతకుముందు లక్షలకు లక్షలు చూసిన మణెమ్మ ఆయాగా పనికి ఎక్కడంతో ఎంతో మంది షాకయ్యారు. మరోవైపు గిట్టనివాళ్లు చేసిన కుట్రలు, చెప్పుడు మాటలు మణెమ్మ పెద్ద కొడుకు శ్రీనివాస్ దంపతుల మధ్య చిచ్చు రేపాయి. దీంతో ఏడాదికే వారు వేరు సంసారం పెట్టారు. కన్న పేగు బంధాన్ని వేరు చేయాలనే కుట్రలకు తల్లీబిడ్డలు పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఆయాగా పనిచేస్తున్న మణెమ్మ(Chittila Manemma) నిత్యం పోలీస్​ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఉపేందర్​రెడ్డి ఆమెకు చేదోడువాదోడుగా ఉన్నాడని, ఆయన సాయం మరువలేనని మణెమ్మ చెబుతోంది.(women life)

http://prastanam.com/success-journey/

పోలీస్ స్టేషన్​లో కొడుకు.. బయటేమో తల్లి..
శ్రీనివాస్ వేరు కాపురం పెట్టి హైదరాబాద్​లో ఉంటున్నారు. తల్లిని చూసేందుకు ఓ రోజు జనగామకు వచ్చారు. తిరిగి హైదరాబాద్​కు వెళ్లేసరికి ఊహించని పరిణామం. దొంగతనం కేసు బనాయించడంతో పోలీసులు ఆయనను స్టేషన్​కు తరలించారు. కొందరి చెప్పుచేతల్లో లేకపోవడమే ఇందుకు కారణం. కొడుకు పోలీస్​స్టేషన్​కు వెళ్లాడన్న విషయం తెలుసుకున్న మణెమ్మ అదే రోజు అర్ధరాత్రి ఆపసోపాలు పడి హైదరాబాద్​కు చేరుకుంది. అప్పటికే ఒళ్లంతా లాఠీ దెబ్బలతో ఉన్న కొడుకును చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. రాత్రంతా కొడుకు కోసం స్టేషన్ ఎదుట వర్షంలో తడుస్తూ ఆమె పడిన యాతన వర్ణణాతీతం. అక్కడే ఉన్న ఓ బంధువు సాయంతో చివరికి కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. ఈ సంఘటన అనంతరం కొన్ని రోజుల పాటు వేర్వేరుగా ఉన్న శ్రీనివాస్ దంపతులు ఆ తరువాత మళ్లీ కలిశారు. ఇద్దరు పిల్లలతో హాయిగా ఉండాల్సిన ఆ దంపతుల మధ్య గొడవలు మాత్రం ఆగడం లేదు. వారంతా చల్లగా ఉంటే చూడాలనే మణెమ్మ కోరిక గాలిలో దీపంలాగే ఉంది.(women life)

చిన్న కొడుక్కు పెద్ద కష్టం..
మణెమ్మ చిన్న కొడుకు దేవేందర్(Devender) సైతం అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ సమస్యలతో సావాసం చేస్తూనే ఉన్నాడు. ఈయన ఇంటర్మీడియట్​లో ఉన్నప్పుడే ఓ అక్రమ కేసు వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఆటుపోట్ల మధ్య డిగ్రీ చదివాక వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. తన కాళ్లపై తాను నిలబడుతూ ఆదర్శంగా ఉంటున్న సమయంలోనే ఓ ఇంటివాడయ్యాడు. చిలకాగోరింకల్లా ఉన్న జంట(Couples) మధ్య కొందరు చిచ్చు పెట్టారు. ఇంకేముంది దేవేందర్ సంసారం అగాథంలో పడింది. కష్టనష్టాలను పాలుపంచుకోవాల్సిన వారే పగ పట్టడంతో ఆయనకు కోలుకోలేని దెబ్బ పడింది. ఏం పాపం ఎరుగని అతడి జీవితం తన ప్రమేయం లేకుండానే చీకటిమయమైంది. వెలుగులు నింపి భరోసానిస్తారనుకున్న మనుషులే ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశారు. పోలీస్​ స్టేషన్లు, కోర్టులకు తిప్పి రాక్షసానందం పొందారు. భౌతిక దాడులతో పాటు మానసికంగా హింసించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరికి ధర్మమే గెలుస్తుందన్న నమ్మకంతో దేవేందర్ ఎదురు పోరాటం సాగించాడు. తాను నడిచే దారిలో ముళ్లకంపలు అడ్డొచ్చినా, రాళ్లదెబ్బలు తగిలినా నడక ఆపడం లేదు. రక్తపు మడుగులో ఈదుతూ లక్ష్యాన్ని చేరుతానని, ఉన్నతంగా ఎదిగి అందరికీ సమాధానం చెప్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Written By

Bommagani Srikanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *