Success Story: కష్టాలతో దోస్తీ.. బతుకు జబర్దస్తీ

* ఆటుపోట్లను ఎదురించి అద్భుత జీవితం

* వ్యాపారిగా రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న యువకుడు

* ఇప్పటి విజయం వెనుక కఠోర శ్రమ

Success Story: కష్టాలతో దోస్తీ.. బతుకు జబర్దస్తీ

తినడానికి తిండి, ఉండడానికి బిల్డింగ్ ఉంది.. ఏ లోటు లేకుండా చూసుకునే అమ్మానాన్న ఉన్నారు. అయినా అతడికి ఏదో వెలితి. తన కాళ్లపై తాను నిలబడాలనే తపన. ఆ లక్ష్యమే అతడిని ఇంటికి దూరం చేసింది. పద్దెనిమిదేళ్ల వయస్సులోనే పట్నంకు వలస బాట పట్టించింది. అల్లారుముద్దుగా పెరిగిన ఆ వ్యక్తి హైదరాబాద్ లో బతుకు పోరాటం చేశాడు. అమ్మ చేతి వంటకు దూరమై, నాన్న పలకరింపు బంగారమై వెక్కివెక్కి ఏడ్చాడు. స్వశక్తిగా ఎదిగేందుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. కూలీగా వెళ్లినోడు.. వ్యాపారిగా స్వస్థలంలో అడుగుపెట్టాడు. వర్కర్ గా ఎక్కడైతే పనిచేశాడో.. అక్కడే పలు షాపులకు ఓనరయ్యాడు. రెండు మెడికల్ షాపులకు యజమానిగా, ఒక మిల్లులో వాటాదారుడిగా ఉండడమే కాకుండా సొంతంగా ట్రావెల్స్(Travels) నడుపుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ముప్పై ఏళ్లు నిండక ముందే నెలకు లక్షకు పైగా ఆదాయం సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉక్కు సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ యువకుడి జీవితమే సజీవ సాక్షం. లక్ష్యానికి తగ్గట్టుగా కష్టపడడమే కాదు.. అందుకు తగ్గ వ్యూహరచనతో ముందుకెళ్లడం వల్లే తనది ‘సక్సెస్ జర్నీ’ అవుతోందని ఆ కుర్రాడు చెబుతున్నాడు. (Success Story)

ఇప్పటి రాజసం వెనుక కఠోర శ్రమ ఉంది. ఇప్పటి హుందాతనం వెనుక అనేక అవమానాలున్నాయి. ఇప్పటి స్థితి వెనుక గట్టి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి తగ్గ వ్యూహరచన ఉంది. అందుకే ఆ యువకుడు నలుగురు మెచ్చేలా బతుకగలుగుతున్నాడు. మూతి మీద మీసం కూడా రానప్పుడే వ్యాపారిగా ఎదగాలనే ఆలోచన వచ్చింది. అతడిని చూసి ఎంతోమంది హేళన చేశారు. అయినా పట్టించుకోని ఆ యువకుడు లక్ష్యానికి తగ్గట్టుగా శ్రమించాడు. కష్టపడటమే కాకుండా ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల ఐదేళ్లలోనే మంచి స్థాయికి వచ్చాడు. అయితే ఇక్కడితే తన లక్ష్యం పూర్తి కాలేదని, మరింత పోరాటం మిగిలే ఉందని ఆ యువకుడు చెబుతున్నాడు. వివరాల్లోకెళితే.. జనగామ జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన జిల్లా కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు. మూడో కొడుకు జిల్లా సాయిరాజు ‘ప్రస్థాన’మే ఈ కథనం.. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం ఉన్న సాయి ఏడో తరగతి వరకు స్వగ్రామం మర్మామూలలో చదివాడు. ఏడు నుంచి పదో తరగతి వరకు చేర్యాలలోని బాల విద్యాజ్యోతి పాఠశాలలో విద్యనభ్యసించాడు. అయితే సాయి తండ్రి కృష్ణమూర్తికి తాను చేసే అడ్తి వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో జనగామకు షిఫ్ట్ అయ్యారు. సాయి ఇక్కడే చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఏకశిల డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు.

Success Story: కష్టాలతో దోస్తీ.. బతుకు జబర్దస్తీ

ఇంటర్ చదువుతున్న సమయంలోనే పార్ట్ టైం జాబ్ చేశాడు. కాలేజీకి వెళ్లి రాగానే సాయంత్రం నుంచి రాత్రి వరకు మెడికల్ షాపులో వర్క్ చేసేవాడు. మొదట్లో రూ.2 వేల జీతానికి పనికి ఎక్కగా.. తన పనితనానికి ఐదు నెలల్లోనే రూ.5 వేలకు, ఆ తరువాత రూ.12 వేలకు పెరిగింది. ఇలా నెలనెలా వచ్చే జీతాన్ని చిట్టీల రూపంలో పోగు చేశాడు. అలా జమ చేసిన డబ్బులను ఓ మెడికల్ షాపులో పెట్టుబడి పెట్టి పార్ట్ నర్గా మారాడు. ఈ విషయంలో హర్షించాల్సిన వారే ఆగ్రహం వ్యక్తం చేశారు. భరోసా ఇవ్వాల్సిన వారే సాయి ఆశయాన్ని భగ్నం చేశారు. చిన్న వయస్సులోనే వ్యాపారం చేయడం ఇంట్లో వాళ్లకు నచ్చలేదు. ఈ విషయంలో కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. బట్టల బ్యాగుతో సిటీలోని దుండిగల్ లో దిగాడు. అప్పటికి 18 ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్నాడు. అయిన వాళ్లందరినీ విడిచి వెళ్లగానే అతడికి కన్నీళ్లు ఆగలేదు. వెంటనే సొంతూరుకు వెళ్దామనుకున్నాడు. ఖాళీ చేతులతో వెళ్లడం ఇష్టం లేక అక్కడే ఉండిపోయాడు. తన సంకల్పం నెరవేరాలంటే కష్టపడక తప్పదని భావించాడు. ఇండస్ట్రీయల్ ఏరియాలో అడుగుపెట్టిన సాయి కలుషిత వాతావరణంలో, బూజు పట్టిన రూముల్లో బతుకు వెళ్లదీశాడు. మొదట్లో అక్కడ పరిచయమైన స్నేహితులతో కలిసి క్యాటరింగ్ పని చేశాడు. ఈ పనిలో ఎన్నో అవమానాలు భరించాడు. తిండికి, నిద్రకు ఓర్చుకుంటూ బతుకు పోరాటం చేశాడు. రాత్రింబవళ్లు(డబుల్ డ్యూటీ) కడుపు కట్టుకుని క్యాటరింగ్ పనిచేస్తూ పైసాపైసా కూడబెట్టాడు. ఆ తరువాత హైదరాబాద్ లోనే మెడ్​ ప్లస్​, మరో మెడికల్ షాపులో పనిచేశాడు. వీటిలో మంచి జీతం ఉండడంతో సాయికి ఆర్థికంగా కలిసివచ్చింది. కానీ తిండికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వ్యాపారిగా ఎదగాలనే లక్ష్యం మేరకు అందుకు అవసరమైన డబ్బులు సమకూరే వరకు సిటీలో జాబ్ చేశాడు. (Success Story)

http://prastanam.com/women-life-chittila-manemma/

బిజినెస్ మెన్ గా జనగామకు..
కట్టుబట్టలతో హైదరాబాద్ కు వెళ్లిన సాయిరాజు ఐదేళ్ల తరువాత జనగామలో అడుగుపెట్టాడు. మెడికల్ ఫీల్డ్ లో మంచి అనుభవం ఉండడంతో ఆ వృత్తినే వ్యాపారంగా ఎంచుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో జనగామలో ‘తిరుమల మెడికల్’ షాపును సొంతంగా ప్రారంభించాడు. అయితే షాపు ప్రారంభించడం ఒక ఎత్తయితే దానిని సక్సెస్ ఫుల్ గా నడిపించడం మరో ఎత్తు. ఇందులో సాయి సఫలీకృతుడయ్యాడు. గత అనుభవం, చురుకుగా పనిచేసే తత్వం ఇందుకు కలిసొచ్చింది. ఈ షాపునకు జనగామ పట్టణంలో మంచి ఆదరణ లభించింది. సేల్స్ కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఒక్కడే షాపు నడిపించడం కష్టతరంగా మారింది. కొద్దిసేపు కూడా తీరిక సమయం దొరికేది కాదు. దీంతో షాపులో మరో ఇద్దరిని భాగస్వాములుగా చేర్చుకున్నాడు. అప్పుడు కొంత రిలాక్స్ అయ్యాడు. అయినా సమయాన్ని వృథా చేయలేదు. అంతకుముందే హైదరాబాద్​లో తన బావతో కలిసి ట్రావెల్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ఫీల్డును వదలకుండా జనగామలో కంటిన్యూ చేశాడు. మరో వైపు సీజనల్ గా చిన్నాచితక వ్యాపారాలు చేస్తూ సాయి దినదినాభివృద్ధి చెందాడు. ఇదే క్రమంలో జనగామ పట్టణంలో పార్ట్ నర్ షిప్ లో మరో మెడికల్​షాపు(మారుతి) పెట్టాడు. అంతేగాకుండా ఓ మెడికల్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాడు. వీటన్నింటితో పాటు ఇటీవలే లింగాలఘణపురంలో ఓ రైస్ మిల్లులో వాటాదారుడిగా చేరాడు. మొత్తానికి నాలుగు రకాల వ్యాపారాలు చేస్తూ తన కాళ్లపై తాను నిలబడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తమ తండ్రి కృష్ణమూర్తి గతంలో రైస్మిల్లు పెట్టాలని అనుకున్నాడని, ప్రస్తుతం తాను ఆ కోరిక నెరవేర్చడం సంతోషంగా ఉందని సాయి ఆనందం వ్యక్తం చేశాడు. మెడికల్ ఫీల్డులో ముందు నుంచీ సాయిచంద్ర అనే వ్యక్తి తనకు వెన్నుదన్నుగా నిలిచాడని చెబుతున్నాడు.(Success Story)

http://prastanam.com/success-journey/

Success Story: కష్టాలతో దోస్తీ.. బతుకు జబర్దస్తీ

‘విజయ’యాత్రలో అమ్మ పాత్ర..
ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సాయికి తన తల్లి విజయలక్ష్మి వెన్నుదన్నుగా నిలిచింది. ఎంతమంది హేళన చేసినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే వాటిని ఎదుర్కొన్నానని సాయి చెప్పాడు. ఆయన హైదరాబాద్ కు వెళ్లినప్పుడు విజయలక్ష్మి దు:ఖం అంతా ఇంతా కాదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఎక్కడ ఉంటున్నాడో.. ఏం తింటున్నాడోనని ఎంతో బెంగ పెట్టుకుంది. మొత్తానికి హైదరాబాద్ లో ఐదేళ్ల నిర్విరామ కృషి నుంచి మొదలుకొని జనగామకు వచ్చాక సాయి ‘విజయ’యాత్రలో తల్లి ఎంకరేజ్ మెంట్ ఎంతో ఉంది. దు:ఖమొచ్చినా, సంతోషమొచ్చినా తాను ముందుగా అమ్మతోనే పంచుకుంటానని సాయి చెప్తున్నారు.

టార్గెట్.. ఇల్లు, సేవా
జనగామలో ప్రముఖ వ్యాపారిగా ఎదగడమే కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవడం తన టార్గెట్ అని సాయి చెబుతున్నాడు. ఎంత కష్టమైనా తన లక్ష్యాన్ని త్వరలోనే చేరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అడ్తి వ్యాపారిగా, సామాజిక సేవకుడిగా జనగామ ప్రజలకు సుపరిచితుడైన తన తాత బెజగం చంద్రయ్య స్ఫూర్తితో భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అంటున్నాడు. (Success Story)

 

ఇవీ చదవండి..

http://prastanam.com/rangoli-art-peddi-kusuma/

http://prastanam.com/eagle-inspirational-story/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *