Success Journey: పెయింటర్​ నుంచి ప్రముఖ కాంట్రాక్టర్​గా…

  • చదువు మానేసి.. ఇంటిని చక్కదిద్దిన యువకుడు

  • నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు

అప్పటివరకు హ్యాపీగా బతుకుతున్న ఆ కుటుంబానికి అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయి. దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో జరిగిన ఓ చిన్న సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడింది. సర్వం కోల్పోయి అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలను 13 ఏళ్లకే ఓ బాలుడు భుజాన ఎత్తుకున్నాడు. పదేళ్ల నిర్విరామ కృషితో కష్టాలను పొలిమేరలు దాటించాడు. ప్రతికూల పరిస్థితుల్లో చదువు మానేసి పెయింటర్​గా మారిన యువకుడు ఇప్పుడు కష్టాల ఒడ్డు దాటి ప్రముఖ కాంట్రాక్టర్​గా వెలుగొందుతున్నాడు. నిత్యం 30 మందికి పని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ సామాన్యుడి సక్సెస్​ యాత్ర చూద్దామా..

జనగామ జిల్లాకేంద్రానికి చెందిన గాలిబ్​, బిపాషా దంపతులకు ముగ్గురు సంతానం. వివిధ వ్యాపారాలు చేస్తూ గాలిబ్​ తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ వచ్చాడు. దేవరుప్పుల మండలంలోని చిన్నమడూరులో కొన్ని సంవత్సరాలు టెంట్​హౌస్​ నిర్వహించాడు. ఆ తరువాత జనగామలోని సంజయ్​నగర్​లో కుట్టుమిషన్​ షాపు పెట్టుకుని టైలర్​ వర్క్​ స్టార్ట్​ చేశాడు. దీనికి తోడు చిన్న చికెన్​ సెంటర్​ పెట్టగా తన భార్య బిపాషా చూసుకునేది. ఈ రెండు షాపులు మంచిగా రన్​ అవుతుండడంతో వారి కుటుంబం హ్యాపీగా ఉంది. ఇదే సమయంలో గాలిబ్​ రెండు ఆటోలను కొని ఇద్దరు డ్రైవర్లను పెట్టుకొని వాటిని నడిపించాడు. ఇందులో ఒక ఆటో యాక్సిడెంట్​కు గురికావడంతో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనే గాలిబ్​ స్థితిని అధ:పాతాళానికి నెట్టింది. ఆటో ధ్వంసమై ఆస్తినష్టం జరగడమే కాకుండా ముగ్గురికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. దీంతో గాలిబ్​ అప్పులపాలయ్యాడు. దీనికి తోడు అప్పటివరకు మంచిగా నడిచిన చికెన్​ సెంటర్​, టైలరింగ్​ కూడా డీలా పడ్డాయి. ఓ వైపు అప్పులకుప్పలు, మరోవైపు జీవనోపాధి దెబ్బతిని కుటుంబం రోడ్డున పడింది.

ఎనిమిదో తరగతి నుంచే పనికి..
గాలిబ్​ కూతురు వివాహం చేశాక కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అప్పటికి ఎనిమిదో తరగతి చదువుతున్న గాలిబ్​ పెద్ద కొడుకు అలీమొద్దిన్​ అలియాస్​ బాబా కుటుంబ బాధ్యతలను భుజాలపై ఎత్తుకోవాల్సి వచ్చింది. వేసవి సెలవులు రాగా రోజుకు రూ.40 వేతనంతో పెయింటింగ్​ పనికి ఎక్కాడు. అంత చిన్న వయస్సులోనే ఏకంగా జనగామ నుంచి హైదరాబాద్​కు అప్​ అండ్​ డౌన్​ చేశాడు. ఇలా పదో తరగతి పూర్తయ్యే వరకు సమ్మర్​ హాలీడేస్​ వచ్చినప్పుడల్లా పనికి వెళ్లి ఇంటికి ఆసరా అయ్యాడు. పదో తరగతి పాసైనప్పటికీ ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంటర్​ చదవలేకపోయాడు. తోటి స్నేహితులంతా కాలేజీలకు వెళ్తుంటే బాబా మాత్రం పని కోసం పట్నం బాట పట్టాడు. అంతకుముందు అలవాటు అయిన పెయింటింగ్​ పనినే జీవనోపాధిగా ఎంచుకున్నాడు.

http://prastanam.com/common-man-success-story/

alimoddin

హైదరాబాద్​లో అరిగోస..
బాబా పదో తరగతి కంప్లీట్​ చేశాక పెయింటింగ్​ పనికి వెళ్లి తెచ్చే డబ్బులే ఇంటికి దిక్కు. దీంతో ఇంట్లో వారంతా తలో పని చేయొచ్చనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్​కు షిఫ్ట్​ అయింది. కానీ అక్కడికి వెళ్లాక వారు అనుకున్నట్టు జరగలేదు. వారంతా తిండి లేకుండా గడిపిన రోజులే ఎక్కువ. బాబా తండ్రి గాలిబ్​ ఓ హాస్పిటల్​లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. నెలకు రూ.10 వేలు ఇస్తామన్న వారు నెలకు రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. బాబా తల్లి అనారోగ్య కారణాల వల్ల ఏ పనీ చేయలేకపోయింది. తమ్ముడు జమీర్​ కూడా చిన్నవాడు కావడంతో ఇంట్లోనే ఉండేవాడు. అప్పటికి పదహారేళ్లు మాత్రమే ఉన్న బాబా పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. మౌలాలిలోని ఓ ప్లాస్టిక్​ కంపెనీలో నెలకు రూ.2 వేల జీతానికి పనికి ఎక్కాడు. కాలేజీలో చదవాల్సిన పిల్లాడు కార్మికుడిగా మారాడు. కడుపు కాలుతుంటే.. కన్నీళ్లు దిగమింగుకుని కూలీ పని చేశాడు. అంత కష్టపడ్డప్పటికీ ఏనాడూ కడుపు నిండ తిన్నది లేదు. ఊళ్లో చేసిన అప్పులు తీర్చడం కోసం పట్నం వస్తే కనీసం తినడానికి తిండి కూడా దొరకర గాలిబ్​ కుటుంబం దారుణ పరిస్థితులను ఎదుర్కొంది.

తొమ్మిది కిలోమీటర్లు సైకిల్​పైనే..
బాబా పనిచేసే కంపెనీ వారి ఇంటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆయనకు నెలంతా కష్టపడితే వచ్చేది 2 వేల జీతం. ఇక కంపెనీ దాకా ఏదైనా వెహికిల్​లో వెళ్లాలంటే చార్జీలకే సగం జీతం పోతుంది. దీంతో బాబా సెకండ్​ హ్యాండ్​లో ఓ సైకిల్​ కొన్నాడు. దానిపైనే రోజూ డ్యూటీకి వెళ్లొచ్చేవాడు. తనకొచ్చే తక్కువ జీతం సరిపోకపోవడంతో నెలలో 20 రోజులపాటు ఓవర్​ టైం డ్యూటీ కూడా చేశాడు. నాన్​స్టాప్​గా 20 రోజులు రాత్రింభవళ్లు కంటికి కునుకు, కడుపుకు అన్నం లేకుండా అంత చిన్న వయస్సులో పనిచేయడం సాహసోపేతమే. ఓవర్​టైం డ్యూటీ సమయంలో రోజులో 24 గంటల్లో రెండు గంటలు మాత్రమే రిలీఫ్​ ఉండేది. ఇలా ఏడాది పాటు పనిచేశాడు.

baba parents

పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలని..
నాలుగు పనులు చేసుకుని అప్పులన్నీ తీర్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో పట్నం వచ్చిన బాబా ఫ్యామిలీ హైదరాబాద్​లో ఇమడలేకపోయింది. తండ్రీకొడుకులు ఎంత కష్టం చేసినా తినడానికి కూడా వెళ్లకపోవడంతో తిరిగి సొంతూరు జనగామకు వెళ్లాలని ఫిక్సయ్యారు. అనుకున్నట్టే అక్కడికి వెళ్లాక ఇంటిని చక్కదిద్దడానికి బాబా పెద్ద బరువును తన మీద వేసుకున్నాడు. మొదట్లో పెయింటింగ్​ పనికి వెళ్లిన అనుభవం ఉండడంతో మళ్లీ అదే పనికి ఎక్కాడు. 2007 సంవత్సరం నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు జనగామ నుంచి హైదరాబాద్​ వరకు అప్​ అండ్​ డౌన్​ చేశాడు. ఆ తరువాత సొంతూరు జనగామలోనే పనిచేశాడు. అదే సమయంలో బాబా తండ్రి ఆటో నడపడం మొదలుపెట్టడంతో ఫ్యామిలీ పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. బాబా తమ్ముడు జమీర్​ డిగ్రీ వరకు అన్న సాయంతో చదువుకోగా.. ఆ తరువాత ఓ వైపు ఆటో నడుపుతూ మరోవైపు తన ఎంబీఏ చదువును కంప్లీట్​ చేశాడు. ఇంట్లో ముగ్గురు పనిచేస్తుండడంతో అప్పులన్నీ మెల్లమెల్లగా తీరిపోయాయి.

చేతులకు పొక్కులు వచ్చినా..
ఇంటర్​ చదివే వయస్సులో పెయింటర్​గా మారిన బాబా తన పనిలో ఎదుర్కొన్న కష్టాలు అంతా ఇంతా కావు. చిట్టి చేతులకు పొక్కులు వచ్చినా ఏనాడూ పని మానలేదు. కన్నీరు తన్నుకుంటూ వస్తున్నా.. ఒంట్లో సత్తువ లేకున్నా డీలా పడలేదు. ఎందుకంటే తన ముందున్నది ఒకటే లక్ష్యం. కష్టాలు గట్టెక్కి ఇంటిని చక్కదిద్దాలనే కాయుష్షు.

alimoddin 2
(వర్క్​ చేయిస్తున్న బాబా)

కాంట్రాక్టర్​ స్థాయికి..
సొంతూరులో 2012 నుంచి పని ప్రారంభించిన బాబా ఓ సీనియర్​ దగ్గర మంచి మెళకువలు నేర్చుకున్నాడు. సొంతంగా పనులు చేజిక్కించుకోవడం స్టార్ట్​ చేశాడు. కూలీగా పనిచేస్తూనే సైడుకు కొన్ని పనులు కాంట్రాక్ట్​ పట్టేవాడు. ఇలా ఓ నాలుగేళ్లు వర్కర్​ కమ్​ కాంట్రాక్టర్​గా పనిచేస్తూ వచ్చాడు. ఆ తరువాత పూర్తిస్థాయి కాంట్రాక్టర్​గా మారాడు. మొత్తానికి తన కష్టంతో అప్పులన్నీ తీర్చడమే కాకుండా తమ ఫ్యామిలీ చిరకాల వాంఛ సొంతింటి కళను నెరవేర్చడంలోనూ బాబా సఫలీకృతులయ్యారు.

30 మందికి ఉపాధి..
పెయింటర్​ నుంచి కాంట్రాక్టర్​గా ఎదిగిన బాబా నిత్యం 30 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందిన బాబా జనగామ జిల్లాలోనే కాకుండా భువనగిరి జిల్లా, హైదరాబాద్​ లలోనూ పెద్ద పెద్ద సైట్లకు పెయింట్​ కాంట్రాక్ట్​ పడుతూ ప్రస్తుతం బిజీగా మారాడు. సొంతిల్లు కట్టుకున్నాక కూడా తన ఫీల్డు చూసి పిల్లనివ్వడానికి కొందరు నిరాకరించారని బాబా చెప్పారు. చివరికి పేదింటి అమ్మాయిని చేసుకున్నానని, ఆమె తన ఇంట్లో అడగుపెట్టాక మరింత కలిసొచ్చి పెద్ద కాంట్రాక్టర్​గా ఎదిగానని బాబా తెలిపారు. తిండి లేని రోజులు, నిద్ర లేని రాత్రులు ఎన్నో చూసిన బాబా ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సుమారు పదేళ్లు పట్టింది. చిన్నచిన్న కష్టాలు, సిల్లీ గొడవలకే జీవితం అయిపోయినట్టు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎంతోమందికి బాబా అండ్​ ఫ్యామిలీ సక్సెస్​ స్టోరీ స్ఫూర్తిదాయకమే కదా.

Written By
Bommagani Srikanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *